గతేడాదితో పోల్చితే మద్దతు ధర
పెంపు వివరాలు ఇలా (క్వింటాకు రూ..)
గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. గత ఏడాది రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేయగా వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. మార్కెట్‌లో ధర లేకపోవడంతో రూ. 70 వేల మేరకు నష్టపోయాను. ఈ ఏడాది ప్రభుత్వం వరికి పెద్దగా మద్దతు ధర ప్రకటించకపోవడంతో వరి సాగుపై ఆసక్తి లేదు. నాలుగు ఎకరాల పొలంలో పప్పుశనగ సాగు చేయాలనుకుంటున్నాను. ప్రభు త్వాలు రైతుల కష్టాన్ని గుర్తించి మద్దతు ధర పెంచాలి.
– ప్రతాప్‌రెడ్డి, రైతు, భీమునిపాడు,
కోవెలకుంట్ల మండలం
ఈ ఏడాది ఖరీఫ్‌లో నాలుగున్నర ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 40 వేల చొప్పున మరో 4.5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో మిరప, మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో విత్తన పనులు సాగడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాకు కేవలం రూ. 10 మాత్రమే పెంచడం విచారకరం.
– రమణారెడ్డి, రైతు, చిన్నకొప్పెర్ల,
కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల: గత మూడేళ్ల నుంచి వ్యవసాయం కలసి రాకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. పెరిగిన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సేద్యాలు, కలుపు నివారణ, ఇతర వ్యయసాయ ఖర్చుల కనుగుణంగా మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ పంటల సాగు, పంట దిగుబడులకు మద్దతు ధరకు ఏమాత్రం పొంతన లేకపోవడం అన్నదాతను నిరాశ పరుస్తోంది. ఆయా పంటలకు ప్రతి ఏటా మద్దతు ధర నామమాత్రంగా పెంచుతున్నారే తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ)సాగు భారంతో పోలిస్తే నామమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 2.52 లక్షల హె క్టార్లలో రైతులు వరి, మొక్కజొన్న, మినుము, మిరప, జొన్న, పెసర, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, పొద్దుతిరుగుడు, ఉల్లి, సోయాచిక్కుడు, తదితర పంటలు సాగు చేయాల్సి ఉంది. 2026–27 ఖరీఫ్ సీజన్‌లోని 10 రకాల పంటలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది ఆయా పంటలకు ప్రకటించిన మద్దతు ధర ఆశాజన కంగా లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 69,483 హెక్టార్లలో వరి, 61,615 హెక్టార్లలో మొక్కజొన్న, 10,138 హెక్టార్లలో మినుము, 38,102 హెక్టార్లలో కంది, 15,143 హెక్టార్లలో పత్తి, 12,078 హెక్టార్లలో మిరప, 8,694 హెక్టార్లలో వేరుశనగ పంటల సాగు లక్ష్యం. గతేడాది సీజన్‌కు ముందే భారీ వర్షాలు కురియగా జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు.
వరికి ఏడేళ్లలో పెరిగింది రూ.100
ప్రతి ఏటా పంట ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నా అనుకున్న మేర పెంచకపోవడంతో అన్నదాతకు వ్యవసాయం భారంగా మారుతోంది. కంటి తుడుపుగా ధర పెంచుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. 2018–19 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సగటు వరి ధాన్యంపై సరాసరిన రూ. 100 లోపే మాత్రమే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు ఏటా రెట్టింపవుతున్నాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి పంటకు గతేడాదికంటే ఈ ఏడాది కేవలం రూ. 72 ధర పెంచడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిపై 1.5 రెట్లు మద్దతు ధర కల్పిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే పంట ఉత్పత్తులను విక్రయించి నష్టాల ఊబిలో కూరుకపోతున్నారు.
పంటరకం 2025–26 2026–27 పెరిగిన ధర
వరి సాధారణ 2,369 2,441 72
వరి ఏగ్రేడ్ 2,389 2,461 92
జొన్న హైబ్రీడ్ 3,699 4,023 324
జొన్న మాల్డాంని 3,749 4,073 324
సజ్జలు 2,775 2,900 125
రాగులు 4,886 5,205 319
మొక్కజొన్న 2,400 2,410 10
వేరుశనగ 7,263 7,517 450
పొద్దుతిరుగుడు 7,721 8,343 622
సోయాబీన్ 5,328 5,708 380
నువ్వులు 9,846 10,346 500
పత్తి(మీడియం) 7,710 8,267 577
పత్తి లాంగ్‌స్టేఫుల్ 8,110 8,667 557
కంటి తుడుపుగా మద్దతు ధర
ప్రకటించిన కేంద్రం
స్వల్ప పెంపుతోనే సరిపెట్టిన వైనం
తడిచి మోపెడవుతున్న సాగు ఖర్చులు
అన్నదాతను ఆదుకోని
చంద్రబాబు సర్కార్
జిల్లాలో 2.52 లక్షల హెకార్ల
ఖరీఫ్ పంటల సాగు లక్ష్యం
వరి, మొక్కజొన్న, పంటలకు
మద్దతు అంతంతే


