శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రమేష్‌నాయుడు మంగళవారం కల్యాణకట్ట, కౌంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్యాణకట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్ద్య చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అందరూ కూడా సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులకు, కౌంటర్ సిబ్బందికి సూచించారు. అలాగే భక్తులతో ముఖాముఖిగా మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
● ఐటీడీఏ పీఓ పీవీఎస్ నాయుడు
ఆత్మకూరు: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఐటీడీఏ పీఓ పీవీఎస్ నాయుడు సూచించారు. మండలంలోని బైర్లూటీ చెంచుగూడెంలోని ఆశ్రమ వసతి గృహాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల రిజిస్టర్‌ను పరిశీలించారు. విధుల్లో లేకున్నా సంతకం చేసి వెళ్లిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీరాములకు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్‌లో వసతులు, భోజనం తదితర వివరాల గురించి విద్యా ర్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఉపాధ్యాయులు అనునిత్యం విద్యార్థులు చదువుకునేలా చూడాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం కరివేన గ్రామంలోని పీఎంవీడీవీకే (ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ యోజన) హబ్‌ను సందర్శించి అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఆయన వెంట వెలుగు ఏపీడీ ఇట్లా నాయక్, సిబ్బంది ఉన్నారు.
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మార్చి నెలలో నిర్వహించిన పీజీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు https://rayala seemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలకు 463 మంది హాజరు కాగా 434 మంది ఉత్తీర్ణులయ్యారరు. సప్లిమెంటరీ పరీక్షలకు మొదటి సెమిస్టర్ పరీక్షలకు 48 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.
916 పింఛన్ల కోత
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో జూన్ నెల 4,45,769 పింఛన్లు ఉండగా.. జూలైలో 4,44,853కు తగ్గిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే 916 పింఛన్లపై కోతపడింది. ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో కొత్త పింఛను ఒక్కటీ ఇవ్వకపోవడం గమనార్హం. జూలై నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.194.43 కోట్లు బ్యాంకుల వారీగా నిధులు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
29 నుంచి సహకార వారోత్సవాలు
కర్నూలు(అగ్రికల్చర్): అంతర్జాతీయ సహకార వారోత్సవాలు ఈ నెల 29 నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనే విషయమై సహకార శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్రంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై జూలై 6వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రతి జిల్లాలో వరల్డ్ లార్జెస్ట్ గ్రైన్ స్టోరేజీ ప్లాన్ స్కీమ్ కింద రూ.2 కోట్లతో గోదాము నిర్మించనున్నారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 2,900 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి జూలై 6న భూమి పూజ నిర్వహించనున్నారు.


