● మైనర్ ఇరిగేషన్ అధికారులపై
కలెక్టర్ ఆగ్రహం
● ఆటోలో ప్రయాణించి చెరువుకు వద్దకు
చేరుకున్న వైనం
జూపాడుబంగ్లా: జలధార పనుల్లో నిర్లక్ష్యం సహించేది లేదని కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. రూ.60 లక్షల నిధులతో తంగ డంచ చెరువులో జరుగుతున్న జలధార పనులను మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. చెరువు వద్దకు కారు వెళ్లేందుకు అవకాశం లేకపోవటంతో కలెక్టర్ మూడు కిలో మీటర్ల మేర ఆటోలో ప్రయాణించి చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు విస్తీర్ణం, ఆయకట్టు, ఎస్టిమేషన్ వివరాల గురించి మైనర్ ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పకపోవటంతో డీఈ మనోహర్, ఏఈ చిన్నమస్తాన్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెరువుకు సంబంధించిన సమగ్ర వివరాలతో నంద్యాలకు వచ్చి తనను కలవాలని ఆదేశించారు. జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతులకు గురవ్వటంతో పొలాలకు సాగునీరు అందక ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో మోటార్ల మరమ్మతులకు రూ.10 లక్షలు, ఆయకట్టు రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల వద్దకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా కస్తూర్బా, గురుకుల పాఠశాలలను సందర్శించి ఎస్‌ఓ యశోద, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తిలకు పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రహరీ వెంట మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీఓ గోపికృష్ణ, ఏఈ నాగేంద్రబాబు, ఏపీఓ రేష్మ పాల్గొన్నారు.


