● 195 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
బనగానపల్లె: అవుకు పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నవరం, సింగనపల్లి, లింగంబోడు గ్రామాల్లో ఇటీవల వరుస చోరీలకు పాల్పడిన దొంగలు దొరికారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.26 లక్షల విలువైన 195 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన తోక మోసా, మిద్దె హుస్సేన్ వలి, తెలుగు వెంకటేశ్వర్లు చెడు వ్యసనాలకు బానిసై, ఈజీగా డబ్బు సంపాదనకు చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పగటిపూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారు. ఇంటి యజమానులు పని మీద బయటికి వెళ్లే సమయంలో ఇంటి బయట, గూళ్లలో ఉంచిన తాళం చెవులు తీసుకుని ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అవుకు ఎస్‌ఐ అశోక్, పోలీ సు సిబ్బంది మంగళవారం స్థానిక సాయిబాబా ఆలయం సమీపంలో వాహ నాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన పై ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల దొంగలు పట్టుబడ్డారు. చోరీ కేసులను త్వరితగతిన ఛేదించిన సీఐ మంజునాథ్‌రెడ్డి, ఎస్‌ఐ అశోక్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్‌తో పాటు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.
జిల్లాలో మూడు రోజులు వర్షాలు
ఎమ్మిగనూరు సెంటల్ర్: జిల్లాలో ఈ నెల 24, 26, 27వ తేదీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ వయన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.


