● వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ
సంస్థలకు కేటాయించడం దారుణం
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల: రాష్ట్ర మంత్రి ఫరూక్ వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కౌలూరు గ్రామం ఈద్గాకు చెందిన వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న పది ఎకరాల స్థలాన్ని కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్ వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సింది పోయి, ఇలా కోర్టుల నిర్మాణానికి రాసివ్వడం ముస్లిం సమాజానికి ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ‘ఒక్కసారి అల్లాకు ఇచ్చిన స్థలాలను కేవలం ముస్లింల ప్రయోజనాల కోసం, దైవకార్యాల కోసమే ఉపయోగించాలని, వాటిని అమ్మడం, బదలాయించడం నిషిద్ధమన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడలేని మంత్రి ఫరూక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నూనెపల్లి జామియా మసీదు ఆస్తులను కాపాడామన్నారు. కూటమి ప్రభుత్వం చాబోలు గ్రామం వద్ద ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన 19 ఎకరాల 14 సెంట్ల భూమిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు కేటాయించడం దారుణమన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జిల్లాలోని ముస్లిం మైనార్టీలంతా సంఘటితం కావాలన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నీ సా, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రెటరీ దేవనగర్ బాషా వైఎస్సార్‌సీపీ ముస్లిం నాయకులు సలముల్లా, గన్నీ కరీం,ఎం.గౌస్, తదితరులు పాల్గొన్నారు.


