పేదల సొంతింటి కల ధ్వంసం! | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల ధ్వంసం!

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

అధికారులు న్యాయం చేయాలి

పొలంగా మారిన లే– అవుట్‌

కుప్పగా పడిన పాట్ల సరిహద్దు రాళ్లు

రుద్రవరం: అధికార దర్పంతో రెండేళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు బరి తెగిస్తున్నారు. కొందరు వాగులు, వంకలు, చెరువులను చెరబట్టి ప్రకృతి సంపదను కొల్లగొట్టి రూ. లక్షలు సంపాదిస్తున్నారు. మరి కొందరు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ఆక్రమించి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు ఏకంగా ప్రభుత్వ లేఅవుట్లను ఆక్రమించి పొలాలుగా మార్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయా శాఖలకు చెందిన అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా రుద్రవరం మండలంలోని హరినగరం గ్రామంలో గతంలో గిరిజనులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఓ టీడీపీ నేత ఆక్రమించేశాడు. రుద్రవరం మండలం హరినగరం వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లే – అవుట్‌గా మార్చింది. అందులో రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి నంబర్లతో కూడిన రాళ్లను పాతారు. ఆ లే – అవుట్‌లో హరినగరానికి చెందిన గిరిజనులతో పాటు చిత్రేనిపల్లె, నర్సాపురం గ్రామాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. అనుకున్నట్లుగానే అప్పట్లో ముందుగా హరినగరంలోని గిరిజనులు 20 మందికి పట్టాలు కూడా ఇచ్చారు. మిగిలిన వారికి కూడా ఇచ్చేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతుండగా పలు అనివార్య కారణాలతో లే –అవుట్‌లో గృహ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇంతలో సాధారణ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచి పోయాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్క గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ప్రభుత్వ లే –అవుట్‌పై కన్నేశాడు. గత కొద్ది రోజుల నుంచి అక్కడ రాళ్లను తొలగించి పక్కనే కుప్పగా పోశాడు. ట్రాక్టరు, డోజర్‌తో ముళ్ల కంప, పిచ్చి మొక్కలు వంటి వాటిని తొలగించాడు. రోడ్లను చదును చేసి పొలంగా మార్చేశాడు. ఇదేమని పలువురు లబ్ధిదారులు అడిగినప్పటికీ వారిని లెక్క చేయలేదు. వర్షం కురవగానే విత్తు విత్తేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఇంత సాగుతున్నా రెవెన్యూ శాఖ సిబ్బంది, ఉద్యోగులు తమకేమి తెలియదన్నట్లు నిమ్మకుండి పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై తహసీల్దారు నాగవీణను వివరణ కోరగా వీఆర్వోతో వివరాలు సేకరించి ఆక్రమణలు అడ్డుకుంటామన్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాకు ఇల్లు నిర్మించేందుకు స్థలం కేటాయిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నాయకులు కబ్జా చేస్తున్నా రు. సొంత ఇళ్లులేక, కట్టుకునేందుకు స్థలం లేక గతంలో ఎంతో ఇబ్బంది పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో స్థలం దక్కిందని సంతోష పడ్డాను. కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడిచినా ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు. ఆ పార్టీ నాయకుడు ఏకంగా లే – అవుట్‌ స్థలాన్నే కబ్జా చేశాడు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేయాలి.

– ముత్యాలమ్మ, లబ్ధిదారు, హరినగరం

ప్రభుత్వ లే – అవుట్‌ను ఆక్రమించిన

టీడీపీ నేత

పొలంగా మారిన గిరిజనుల

ఇళ్ల ప్లాట్లు

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement