● నాసిరకంగా ఎస్సారెమ్సీ లైనింగ్ పనులు
● కనిపించని పర్యవేక్షణ అధికారులు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ వరకు చేపట్టిన లైనింగ్ పనుల్లో నాణ్యత మాయమవుతోంది. ఓ వైపు పనులు జరుగుతుండగా.. మరో వైపు పగళ్లు దర్శనమిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం దృష్ట్యా కృష్ణానది వరద సమయంలో నెల్లూరు, మద్రాసు తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం వాటా నీటిని సకాలంలో వేగంగా తరలించాలనే లక్ష్యంతో ఎస్సారెమ్సీ (శ్రీశైలం రైట్‌బ్రాంచ్ మెయిన్ కెనాల్) లైనింగ్ పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నీటి విడుదల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80వేలకు పెంచారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల వరకు 16.5 కిలో మీటర్ల మేర కుడి, ఎడమ గట్లకు లైనింగ్ చేయటంతో పాటు నీరు దిగువకు వేగంగా ప్రవహించేలా కాల్వ అడుగున కాంక్రీట్ బెడ్డు నిర్మించతల పెట్టారు. 2020లో రూ.1,017. 22 కోట్లతో నిర్మాణం పనులను పీఎన్‌సీ కంపెనీ వారు దక్కించుకున్నారు. పనులను దక్కించుకున్న ఈ కంపెనీ గుడ్‌విల్ తీసుకుని వ్యామ్ కంపెనీకి అప్పగించింది. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పనులను వ్యామ్ కంపెనీ నత్తనడకన చేపడుతోంది. ఆరేళ్లు గడిచినా నేటికీ పనులు పూర్తిచేయకపోవటం గమనార్హం. జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటంతో ఓ వైపు పనులు చేస్తుండగానే మరో వైపు చేసిన లైనింగ్ పనులు బీటలు వారి కనిపిస్తోంది. దీంతో పనుల నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పదికాలాల పాటు ఉండాల్సిన ఎస్సార్‌మ్సీ కాల్వ లైనింగ్‌ను నాణ్యతగా నిర్మించాల్సిన అవసరం ఉంది.


