వాన జాడ లేక రైతుల్లో గుబులు మొదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కాస్త ముందస్తుగా మిర్చి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. మండల కేంద్రమైన రుద్రవరం, రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, ఆలమూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు మే నెలలో మిర్చి సాగు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి మిర్చి నారు కొనుగోలు చేసి దాదాపు 600 ఎకరాల్లో నాటించారు. 40 రోజులకు పూత, పిందె రావాల్సి ఉంది. అయితే వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో మొక్కల్లో ఎదుగుదల తగ్గింది. అలాగే ఎండలు అధికంగా ఉండటంతో ఆ మొక్కలకు బింగి తెగులు సోకింది. దీంతో మిర్చి మొక్కల ఆకులు ముడతలుగా చుట్టుకుని అలాగే ఉంటుండటంతో రైతులు చేసేదిలేక ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒక్కో ఎకరానికి దాదాపు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతుల చేతికి చిల్లి గవ్వ కూడా దిగుబడి రూపంలో రాకుండానే పూర్తిగా నష్టపోతున్నారు. కౌలు రైతులు మరింత అధికంగా నష్టాలు చవి చూస్తున్నారు. రైతులు మిర్చి పైరును తొలగించి మొక్క జొన్న సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
– రుద్రవరం


