● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల స్వీకరణ అనంతరం పల్స్ పోలియో కార్యక్రమం, డయేరియా నివారణ చర్యలు, వర్షాకాలంలో తలెత్తే అంటువ్యాధుల నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ డీఆర్‌ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమ వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం పోలియో రహితంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నందున ప్రతి సంవత్సరం ప్రత్యేక రక్షణ చర్యగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28వ తేదీన 90 నుంచి 95 శాతం మంది పిల్లలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనంతరం జూన్ 29, 30 తేదీలలో ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు అందజేస్తామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డయేరియా నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో డైరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


