నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 22వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆర్‌ఎంపీ అదృశ్యం
బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక విశ్వనగర్ వీధికి చెందిన ఆర్‌ఎంపీ నాగేశ్వరరావు గత వారం రోజులుగా అదృశ్యమైనట్లు పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. స్థానికుల వివరాల మేరకు గత 30 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే వారం రోజులుగా తన కుటుంబ సభ్యులతో సహా కనిపించడం లేదు. నాగేశ్వరరావు పట్టణంలోని కొందరి వద్ద రూ. 10 కోట్ల మేర అప్పు చేసి కనిపించకుండా వెళ్లాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇంత వరకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు.
భక్తులకు బంకర్ బెడ్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లికార్జున, గణేశ సదన్‌ల వద్ద భక్తుల సౌకర్యార్థం బంకర్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు ట్రస్ట్‌బోర్డు నిర్ణయించినట్లు దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పొతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రమేష్‌నాయుడు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 45 అంశాలు చర్చించగా 34 అంశాలు ఆమోదించారు. ఏడు అంశాలు వాయిదా, 4 అంశాలు తిరస్కరించారు. క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయలు ప్రదేశాలలో హైమాస్ట్ టవర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్షేత్ర పరిధిలో పలు ప్రదేశాలలో ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ సదుపాయాన్ని కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, డీసీ చంద్రశేఖర్, ఏఈవోలు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు
అండగా ఉంటాం
ఓర్వకల్లు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామచంద్రుడు ఐదు నెలల క్రితం అకాల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆది వారం కాటసాని స్వగృహంలో రామచంద్రుడు కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి బలమైన పునాదులని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. రామచంద్రుడు కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెడ్పీటీసీ రంగనాథ్‌గౌడు, పాలకొలను రమేష్, అక్కిమి హనుమంతరెడ్డి పాల్గొన్నారు.


