‘సర్‌ౖ’పె ఫిర్యాదు చేశారని.. | - | Sakshi
Sakshi News home page

‘సర్‌ౖ’పె ఫిర్యాదు చేశారని..

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై

టీడీపీ నేతల దాడి

డోన్‌: నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే గ్రామల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సర్‌ సర్వేలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. డోన్‌ మండలం కనపకుంట గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ సర్పంచ్‌ కళ్యాణి ముఖ్య అనుచరులైన వెంకటేష్‌, భరత్‌ ఇంటిపై ఆదివారం ఉదయం టీడీపీ నాయకులు మధుసూదన్‌రెడ్డి, ఆయన కుమారుడు మాధవరెడ్డితో పాటు మరికొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ ముఖ్య కార్యకర్త వెంకటేష్‌కు రాయి తగిలి తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. డోన్‌ ప్రభుత్వాసుప్రతిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన భరత్‌ డోన్‌రూరల్‌ ఎస్‌ఐ మమతకు ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకుల ఆగ్రహం..

ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా గ్రామ టీడీపీ నాయకులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ ఆసిస్టెంట్‌ మాధవరెడ్డి గ్రామంలో బీఎల్‌ఓ వెంట తిరుగుతున్నారని, ఈ మేరకు ఫిర్యాదు చేశారనే అక్కసుతో వెంకటేష్‌, భరత్‌పై దాడి జరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. మీట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, వలంటీర్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్ట్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జాకీర్‌ హుసేన్‌, పార్టీ నాయకుడు వంశీ ఆదివారం స్థానిక రూరల్‌ స్టేషన్‌కు వెళ్లారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. నిందితులను స్వేచ్ఛగా వదిలేసి గాయపడిన వారికి ఆసుప్రతిలో చికిత్స చేయించకుండా పోలీస్‌స్టేషన్‌లో ఉంచడం ఏమిటని ఎస్‌ఐ మమతను వారు నిలదీశారు. విచారణ కోసం పిలిపించామని, నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement