● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్‌ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను సమష్టిగా నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించు కుని జిల్లాలో గత 14 రోజులుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించామన్నారు. వృత్తి పరమైన, వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,700 కేంద్రాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో సుమారు 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములై యోగాపై తమ ఆసక్తిని చాటుకున్నారన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమన్నారు. విద్యార్థులు రోజుకు 20 నుంచి 30 నిమిషాలు యోగా సాధన చేస్తే తమ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలరని చెప్పారు. ఆయుష్ యోగా థెరపిస్ట్ తదితర యోగాసనాలను వేసి ప్రాముఖ్యతను వివరించారు. పాణ్యం మండలం విద్యార్థులు సమన్వయ యోగా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.


