● జిల్లాలో 1,401 మంది హాజరు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన
జిల్లా కలెక్టర్, ఎస్పీ
నంద్యాల(న్యూటౌన్): వైద్య విద్య (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఎన్‌టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రీఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఐదు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించి సాయంత్రం 6.15 గంటల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 1,521 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,401 మంది హాజరు కాగా 120 మంది గైర్హాజరయ్యారు. నంద్యాల పట్టణంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా సందర్శించి పరిశీలించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ బొమ్మలసత్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని నీట్ కోఆర్డినేటర్ టి. వెంకటేశ్వరరావు తెలిపారు. పరీక్ష ముగిసిన అనంతరం ఆన్సర్ షీట్లను నిర్దేశిత భద్రతా నిబంధనల ప్రకారం పోస్టల్ వ్యవస్థ ద్వారా సంబంధిత అధికారులకు పంపించే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.


