కర్నూలు సిటీ: నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో నీట్ పరీక్ష హాల్ టికెట్ చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అయితే కొరతను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా పచ్చిమేత కొరతతో పాటు పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 7 లక్షల యూనిట్ల పశువులు ఉన్నాయని, ఆగస్టు నెల వరకు 3 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం కాగా 2.67 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు 75 శాతం సబ్సిడీతో 46 టన్నుల పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదే విధంగా 946 టన్నుల సమీకృత దాణా కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈపీఎండీఎస్ పద్ధతిలో 365 రోజులు భూమిని కప్పి ఉంచే నిరంతర పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.


