లక్ష్యానికి దూరమై.. చైతన్యం కరువై! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి దూరమై.. చైతన్యం కరువై!

Jun 20 2026 11:31 AM | Updated on Jun 20 2026 11:31 AM

ఆళ్లగడ్డ: కిశోర బాలికల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమగ్ర సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కిశోరి వికాసం’ జిల్లాలో తూతూమంత్రంగా సాగుతోంది. సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి క్షేత్రస్థాయిలో శిక్షణా తరగతులు, అవగాహన సదస్సులు ఫొటోలకే పరిమితమవుతున్నాయి. లింగ వివక్ష, బాల్య వివాహాలు, పౌష్టికాహార ప్రాధాన్యం, ఆరోగ్య సమస్యలు వంటి అంశాలపై కౌమారదశ బాలికల్లో అవగాహన కల్పించేందుకు గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో పకడ్బందీగా నిర్వహించారు. ప్రస్తుతం అవగాహన సదస్సులు జరుగుతున్నాయనే సమాచారం కూడా ఎవరికీ తెలియడం లేదు. ‘కిశోరి వికాసం’ కార్యక్రమంలో భాగంగా 11– 18 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థులతో పాటు.. బడి బయట ఉన్న బాలికలను గుర్తించి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలి. సమావేశాల్లో సామాజిక అంశాలు, విద్య, వైద్యం, క్రీడలు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు.. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పౌష్టికాహారం, రుతుక్రమ పరిశుభ్రత, సోషల్‌మీడియా, బా ల్య వివాహాలు, పునరుత్పత్తి, ఆరోగ్యం ప్రభావాలు, పిల్లల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, పోక్సో చట్టం, కౌమార దశలో రక్తహీనత, లింగ అసమానత, విద్య, కెరీర్‌, నైపుణ్యాభివృద్ధి, సైబర్‌ రక్షణ, ఆన్‌లైన్‌ భద్రత, ఆర్థిక అంశాల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, సాధికారత తదితర అంశాలపై షెడ్యూల్‌ ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు క్రీడలు, యోగా, వ్యాయామం వంటి వాటిపై సాధన చేయించాల్సి ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇలాంటివి మచ్చుకై నా కనిపించడం లేదు. అక్కడక్కడా స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు, ఒకరిద్దరు తల్లులతో సమావేశం ఏర్పాటు చేసి ఫొటోలు తీసుకుని ప్రచార ఆర్బాటం చేస్తున్నారు తప్పా.. కనీసం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు లేక పోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిధులు లేవు.. పర్యవేక్షణకు రారు..

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ‘కిశోరీ వికాసం’ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కావడం లేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలే తమ సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక స్థానిక విద్య, ఆరోగ్యం, సచివాలయ, మెప్మా, ఏఎన్‌ఎం, ఆశ, ఆర్పీ తదితర సిబ్బంది గైర్హాజరవుతుండంతో అంగన్‌వాడీ కార్యకర్తలే కార్యక్రమాన్ని మమ.. అనిపిస్తున్నారు.

ఒక్క పూటకే పరిమితం

పదకొండేళ్ల నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలికలు, 15 నుంచి 18 సంవత్సరాల లోపు బాలురను గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు ఉదయం, బాలురకు మధ్యాహ్నం ఈ శిబిరాలు నిర్వహించాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఆయా తేదీలో మండలంలో ఏదో ఓ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కేంద్రంలో కేవలం కేంద్రం చిన్నారులతో సమావేశం ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటుండటంతో కిశోరి వికాశం శిబిరాల ఆశయం నేరవేరడం లేదు.

తూతూ మంత్రంగా కిశోరి వికాసం

నిర్వహణకు నిధులు విదల్చని ప్రభుత్వం

చేతి నుంచి ఖర్చులు పెట్టుకుంటున్న

అంగన్‌వాడీ కార్యకర్తలు

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ఫొటోలకే పరిమితవుతున్న కార్యక్రమం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement