నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని రిమాండ్ ఖైదీలకు ఉచిత న్యాయవాది ఏర్పాటు చేస్తామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సబ్‌జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమాండ్ ఖైదీలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచిత లాయర్‌ను నియమించామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైన ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. సదుపాయలు, భోజనాలు గురించి ఆరా తీశారు. అనంతరం ఖైదీలకు ఆరోగ్య వైద్య పరీక్షలు డాక్టర్ ప్రవీణ్ చేశారు. సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి దివ్య ఖైదీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్‌జైల్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ప్యానల్ న్యాయవాది మద్దయ్య, నాగమద్దిలేటి, వైద్యులు ప్రవీణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు వసతులు కల్పిస్తాం
● డీఈఓ జనార్దన్ రెడ్డి
కొత్తపల్లి: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతికి అప్‌గ్రేడ్ కావడంతో ఎంఈఓ నాగరాజుతో కలసి డీఈఓ తనిఖీ చేశారు. అలాగే గ్రామంలో ఎంపీపీఎస్ స్పెషల్ పాఠశాలలో వసతులను, గదులను, మూత్రశాలలు, వంట గదులను పరిశీలించారు. పాఠశాలలో మనబడి నాడు–నేడు నిధులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ఆ నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించాలని ఎంఈఓకు సూచించారు. కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ అల్టర్‌నేటివ్ స్కూలింగ్ కో–ఆర్డీనేటర్ ప్రసన్న కుమార్, పర్యవేక్షణాధికారి జగన్‌మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
జూలై 1 నుంచి ఈ – ట్రాన్స్‌పోర్ట్ విధానం
నంద్యాల(అర్బన్): వ్యవసాయ ఉత్పత్తులు, జీవన పశు గణన ఉత్పత్తి రవాణాకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి ఈ – ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తుందని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి షేక్ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ కమిటీ శాఖ ఆధ్వర్యంలో వసూళ్లు చేసే పన్నులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నామన్నారు. గతంలో పన్నుల చెల్లింపులకు వ్యాపారులు, ట్రేడర్లు ఇబ్బందులు పడేవారని, మ్యాన్‌వల్ పద్ధతిలో అవకతవకలు, అక్రమాలు ఉండేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ – మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో అవకతవకలకు చెక్ పడుతుందన్నారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి అనుమతులు, పన్నుల వసూళ్లు, తదితరాలు ఈ మార్కెటింగ్ విధానంలో జరుగుతాయని చెప్పారు. ఈ మార్కెటింగ్ విధానంపై వ్యాపారులు, వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలన్నారు.
పది సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. గత నెల 25 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించగా.. 8, 9, 10 తేదీల్లో మూల్యాంకనం చేశారు. పరీక్షలకు 10,187 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,534 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలపై అనుమానాలు ఉంటే ఈనెల 26వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.


