నీట్‌ పునఃపరీక్షకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పునఃపరీక్షకు పటిష్ట ఏర్పాట్లు

Jun 20 2026 11:31 AM | Updated on Jun 20 2026 11:31 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: నీట్‌ పునఃపరీక్షను ఈ నెల 21వ తేదీన సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌తో కలిసి నీట్‌ పునఃపరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నీట్‌ పునఃపరీక్షను జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీఎస్సీ డిగ్రీ కళాశాల, కేవీఎస్సీ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని ఈ ఐదు కేంద్రాల్లో మొత్తం 1,521 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు ముగుస్తుందన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సడలింపులతో సాయంత్రం 6.20 గంటల వరకు సమయం కేటాయించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్‌షోరాణ్‌ మాట్లాడుతూ.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. నిర్దేశిత గుర్తింపు పత్రాలు లేని అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో ప్రవేశం కల్పించడం సాధ్యం కాదన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రామునాయక్‌, అదనపు ఎస్పీ యుగంధర్‌ బాబు, నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్‌, కలెక్టరేట్‌ ఏఓ సుభాకర్‌, డీఈఓ జనార్ధన్‌ రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకట రమణ, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, నీట్‌ కోఆర్డినేటర్‌ టి. వెంకటేశ్వర్లు, వివిధ పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement