టీడీపీ నాయకుల అక్రమ మైనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల అక్రమ మైనింగ్‌

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

దేవదాయ, వక్ఫ్‌ భూముల ఆక్రమణ

రోడ్డును తవ్వుతున్నా పట్టించుకోని

అధికారులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: అధికారంలో ఉన్నామని టీడీపీ నాయకులు బరితెగించారు. విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. దేవదాయ శాఖ, వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. అలాగే రోడ్డును ధ్వంసం చేస్తూ మైనింగ్‌ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్‌, రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం మైనింగ్‌ పనులు చేపట్టాలంటే రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసీ పొందాలి. అనంతరం మైనింగ్‌ అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి ఏమీ లేకుండానే బనగానపల్లె మండలంలోని పలుకూరు, రామకృష్ణాపురం గ్రామాల మధ్య టీడీపీ నాయకులు అక్రమంగా తవ్వకాలు చేపట్టి నాపరాయిని తరలిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకుప్రజలు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రోడ్డు విధ్వంసం

పలుకూరు గ్రామం నుంచి రామకృష్ణాపురం వరకు జెడ్పీ రహదారి ఉంది. రోడ్డులో రూ. కోట్ల విలువ చేసే నాపరాయి ఉండటంతో టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎక్కడికక్కడ రోడ్డును ధ్వంసం చేస్తూ తమ అడ్డులేదన్న విధంగా ఇక్కడి విలువైన నాపరాయిని వెలికితీసి కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు, సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని వక్ఫ్‌బోర్డు భూములు టీడీపీ నాయకుల ఆక్రమణలోనికి వెళ్లాయి. వీటిలో యథేచ్ఛగా మైనింగ్‌ చేపడుతున్నారు.

అర్చకులు అడ్డుకున్నా..

పలుకూరు గ్రామ సమీపంలో శ్రీ చెన్నకేవశస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూమి సర్వేనంబరు 230లో 4.83 సెంట్లు, 230/3లో 4.12 సెంట్లు, 326లో 13.75 సెంట్లు ఉంది. ఇదే గ్రామంలో శ్రీ రామేశ్వరస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూమి సర్వే నంబరు 308లో నాలుగు ఎకరాలు ఉంది. ఈ భూముల్లో విలువైన ఖనిజం ఉండటంతో టీడీపీ నాయకులు అక్రమంగా మైనింగ్‌ పనులు చేపడుతున్నారు. రామేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిలో ‘కూటమి’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఆలయానికి చెందిన అర్చకులు పలు విధాలుగా అడ్డుకుంటూ వచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్‌తో పాటు మైనింగ్‌, దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు.

ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

గత కొద్ది రోజులుగా చెన్నకేశస్వామి ఆలయానికి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్‌ పనులు జరుగుతు న్నాయి. అక్రమ మైనింగ్‌ను అరికట్టి ఆలయ భూములు రక్షించాలని ఆలయ మాజీ చైర్మన్‌ కామిని బాలతిమ్మయ్య ఇటీవల జిల్లా కలెక్టర్‌తో పాటు బనగానపల్లె ఆర్డీఓ, మైనింగ్‌శాఖ ఏడీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement