ప్రకృతి వ్యవసాయం లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

మహానంది: ప్రకృతి వ్యవసాయం రైతులు లాభదాయకమని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. గాజులపల్లె గ్రామంలో కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫార్మ్‌పాండ్‌ను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్‌ తోటల్లో సాగుచేస్తున్న అంతర పంటల వివరాలు తెలుసుకున్నారు. తన పొలంలో వీడ్‌ మ్యాట్స్‌ వినియోగంతో రోజ్‌(గులాబీ), మేరీగోల్డ్‌(బంతిపూలు) సాగు చేస్తున్న విధానాన్ని కలెక్టర్‌కు రైతు హుసేన్‌ వివరించారు. తనకున్న మూడు ఎకరాల పొలంలో ఆపిల్‌ పంటను సాగు చేస్తున్న రైతు కూరగాయల మస్తాన్‌ను జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

పత్తి సాగు పెరిగే అవకాశం

నంద్యాల(అర్బన్‌): ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌ఏఆర్‌ఎస్‌ పత్తి కీటక శాస్త్రవేత్త డాక్టర్‌ శివరామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న ఐదు రోజుల వ్యవధిలో 70 నుంచి 80మి.మీ. వర్షపాతం నమోదు అయినప్పుడు మాత్రమే పత్తిని విత్తుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయని, అక్కడక్కడ సాగు చేసిన పత్తి మొక్కలు వాడుదశకు చేరుకున్నాయని తెలిపారు. వాడు నివారణకు పది గ్రాముల యూరియాను లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలతో రసం పీల్చు పురుగులు, పిండి నల్లి ఆశించే అవకాశం ఉందని తెలిపారు. పసుపు, నీలపు వర్ణపు జీగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున ఏర్పాటు చేయాలని, ఫ్లోనీనిక్‌ అమైడ్‌ 0.3 గ్రాములు, అఫిడో ఫైరోఫిన్‌ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పత్తిలో అంతర్‌ పంటలుగా కంది, జొన్నలను సాగు చేసుకోవచ్చని తెలిపారు. కందిని స్టెరిలిటీ మొజాయిక్‌ వ్యాధి ఆశించే అవకాశం ఉందని, దీని నివారణకు డైకోపాల్‌ అనే మందును పిచికారీ చేయాలన్నారు.

డిప్యూటీ ఎంపీడీఓ సస్పెన్షన్‌

కొలిమిగుండ్ల: డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వరగౌడ్‌ను పంచాయతీరాజ్‌ రాష్ట్ర కమిషనర్‌ సస్పెండ్‌ చేసినట్లు ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ ప్రసాదరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా సమాచారం ఉత్తర్వులు అందడంతో డిప్యూటీ ఎంపీడీఓకు వాట్సాప్‌ ద్వారా పోస్టు చేసినట్లు తెలిపారు. కాగా.. పాణ్యంలో విధులు నిర్వహించిన సమయంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల మంజూరులో చంద్రమౌళీశ్వరగౌడ్‌ ఇష్టానుసారంగా వ్యవహరించారని మాజీ ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు.

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

నంద్యాల(అర్బన్‌): హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హోంగార్డ్స్‌ కమాండెంట్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్‌ ఆదేశాల మేరకు గురువారం పోలీసు కార్యాలయ మైదానంలో హోంగార్డ్స్‌ పెరేడ్‌, దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమానికి పోలీసు శాఖ ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఏడాది హోంగార్డులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందించారు. జిల్లా సాయుధ బలగాల అడిషనల్‌ ఎస్పీ చిన్నికృష్ణ, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

పరిపాలనాధికారులుగా ముగ్గురికి పదోన్నతి

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో సీనియర్‌ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు పరిపాలనాధికారులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్‌ ఆర్డర్స్‌ను అందించారు. వీరిలో ఎం.వీరభద్రయ్యను కౌతాళం ఎంపీడీఓ, బి.గిడ్డమూర్తిని జెడ్పీ, ఏవీ రమణయ్యను ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయానికి ఏఓలుగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ ఏఓలుగా పదోన్నతి పొందిన వారు పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement