● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
డోన్: ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో తాము బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టామని, తక్కువ ధరకే వాటిని విడిపించి ఇస్తామని కొందరి వ్యక్తులు మోసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన గురువారం డోన్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. డోన్ పట్టణానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నెల్లూరు, అనంతపురం నుంచి నకిలీ బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. డోన్ పట్టణంలోని రెండు బ్యాంకుల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులతో కుమ్మకై ్క వీటిని తాకట్టు పెట్టారు. ఇవి మేలిమి బంగారు ఆభరణాలని ప్రజలను నమ్మించి అతి తక్కువ ధరకే విడిపించి ఇచ్చారు. వాటిని తీసుకున్న ప్రజలు అవసరాలకు అమ్మేందుకు బంగారం దుకాణాలకు తీసుకెళ్లగా నకిలీవి అని తేలింది. దీంతో బాధితులు లబోదిబోమన్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన వారి తో పాటు బ్యాంకు ఉద్యోగులను నిలదీశారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకు ఉద్యోగులు చెప్పడంతో బాధితులు గురువారం రాత్రి డోన్ అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. ఇందులో ముఠా ప్రమేయంతో పాటు బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉందని బాధితుడు విశ్వనాథ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.


