ఆర్‌యూ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌యూ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం

Jun 18 2026 1:11 AM | Updated on Jun 18 2026 1:11 AM

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసెర్‌ వి.వెంకట బసరావు హెచ్చరించారు. బుధవారం వర్సిటీలోని సెనేట్‌ హాల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రెక్టార్‌ ఆచార్య ఎన్‌టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.విజయ్‌కుమార్‌నాయుడుతో కలిసి వర్సిటీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఏ ఒక్క పని చేపట్టలేదని, అలాంటప్పుడు అవకతవకలకు ఆస్కారమెక్కడిదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించడంతో పాటు వర్సిటీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించబోమన్నారు. విద్యార్థి సంఘాల నేతలకు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా మార్పు రాకపోవడంతోనే ఇటీవల ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకున్నామన్నారు. నాన్‌ బోర్డర్స్‌ను వర్సిటీ హాస్టళ్లలోకి అనుమతించేది లేదన్నారు. వర్సిటీలో ఇప్పటికే నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల బీఏ ఎకనామిక్స్‌(ఆనర్స్‌), బి.ఫార్మసీ కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. వర్సిటీకి ఐఎస్‌వో 4 స్టార్‌ రేటింగ్‌ వచ్చిందన్నారు. న్యాక్‌ అక్రిడిటేషన్‌ ప్రక్రియను తిరిగి ప్రారంభించామన్నారు. సమావేశంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సి.విశ్వనాథరెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పీవీ సుందరానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement