నంద్యాల(న్యూటౌన్): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో శిక్షణ పొంది గ్రామీణ నిరుద్యోగ యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. క్రాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఈఎస్‌టీఐ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌తోపాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూలు రీజినల్ హెడ్ డి. అనిల్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని శిక్షణ సదుపాయాలను పరిశీలించారు. డైరెక్టర్ అరుణకుమారి, శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీడీపీ నాయకులపై కేసు
ట్కాస్‌ఫోర్స్: ప్రేమ వివాహం చేసుకున్న దంపతులను విడగొట్టడంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన టీడీపీ నాయకులు సీమ సుధాకర్‌రెడ్డి, ఆయన తనయుడు సీమ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఒక యువతి, డోన్ పట్టణం పాతపేటకు చెందిన ఒక యువకుడు ప్రేమించుకొని గత 20 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిని కారులో కిడ్నాప్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్‌కు గురైన యువతిని స్టేషన్‌కు తీసుకెళ్లగా టీడీపీ నాయకులు సీమ సుధాకర్‌రెడ్డి, ఆయన తనయుడు సీమ సుబ్బారెడ్డి అక్కడికి వచ్చారు. ఎస్‌ఐని బెదిరిస్తూ విధులకు ఆటంకం కల్గించారు. యువతిని బలవంతంగా వారి బంధువుల వెంట పంపారు. ఈ ఘటనపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
వైద్య విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ బి.దుర్గా ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీమా చేసిన ఉద్యోగుల పిల్లలు అందుకు అర్హులని, దేశవ్యాప్తంగా 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయించినట్లు చెప్పారు. నీట్(యూజీ)–2026 ర్యాంకు ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్‌కు జూన్ 21వ తేదీలోపు, అలాగే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కోసం జూన్ 24వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
20న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం
కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 23వ విడత ఆర్థిక సహాయం ఈ నెల 20న విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ–కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 2026–27 సంవత్సరానికి మొదటి విడత పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్ కింద రూ.2వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నా యి. అయితే ఎంత మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
పీఆర్ ఈఈగా శివసాగర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అర్బన్): కర్నూలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈగా జి.శివసాగర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న శివసాగర్‌రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు నియమించారు.


