నంద్యాల(వ్యవసాయం): నీట్ – 2026 రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా మంగళవారం తెలిపారు. ఈనెల 21వ తేదీన నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు, తిరుగు ప్రయాణంలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చునని సూచించారు. పరీక్షవిద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీస్‌లు
శిరివెళ్ల: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు గ్రామ సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీస్‌లు జారీ చేయాలని డీఎల్‌డీఓ శివారెడ్డి ఎంపీడీఓను ఆదేశించారు. మంగళవారం కోటపాడు, జీనేపల్లె గ్రామ సచివాలయలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల సిబ్బంది హాజర్ పట్టిక, రికార్డులను పరిశీలించారు. తల్లికి వందనం ఆన్‌లైన్, సామాజిక పింఛన్ల పంపిణీ తర్వాత మిగులు డబ్బులు తిరిగి కార్యాలయానికి చెల్లింపులో అలసత్వం వహించిన వెల్ఫేర్ అసిస్టెంట్‌పై డీఎల్‌డీఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్‌తో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన డిజిటల్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ శివమల్లేశ్వరప్పను ఆదేశించారు. ఈ నెల 17లోగా యోగాంధ్ర రిజిష్ట్రేషన్లు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి మనోహర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశ్వనికుమార్ పాల్గొన్నారు.
అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి మంగళవారం కర్ణాటక రాష్ట్రం హుబ్లికి చెందిన కె.ఆనంద బసవరాజ్ రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు పి.దేవికకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
ఎరువుల అమ్మకాలు నిలుపుదల
నంద్యాల(అర్బన్): ఎరువులను ఎమ్మార్పి కంటే అధికంగా అమ్ముతుండటంతో విజిలెన్స్, వ్యవసాయాధికారులు రూ.22.62 లక్షల ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని నూకల ఎల్లయ్య, న్యూ వసువాహిణి, హర్షిత ఎంటర్‌ప్రైజెస్, లక్ష్మి వెంకట పద్మావతి ట్రేడర్స్‌లలో విజిలెన్స్ వ్యవసాయాధికారి విశ్వనాథ్, ఎస్‌ఐ వెంకటప్రసాద్, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 20:20:0:13 ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తుండటాన్ని తెలుసుకొని రూ.22.62 లక్షల విలువైన 95.6 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు.
నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
బొమ్మలసత్రం: పోలీస్‌శాఖ సమష్టి కృషితో నంద్యాలను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని ఎస్పీ సునీల్ షోరాణ్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్ట్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించామన్నారు. నిర్ణీత గడువులోగా పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచేలా చూడాలన్నారు. నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని సూచించామన్నారు. తీవ్రమైన నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. దోపిడీ, దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ దొంగలను పట్టుకునేందుకు అధునాతన సాంకేతికతను వినియోగించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, ఏఎస్‌పీ జావళి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, రామాంజినాయక్, శ్రీనివాస్, శ్రీనివాసులు పాల్గొన్నారు.


