ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్‌లో భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును ఆ శాఖలో పర్యవేక్షక అధికారిగా ఉన్న చాంద్‌బాషా తన బంధువులు, పరిచయస్తుల ఖాతాలకు మళ్లించిన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక పోలీసులు కేసుమోదు చేసినప్పటికీ దర్యాప్తు నత్తనడకన సాగింది. ఈ కేసులో మొదట్లో రూ. లక్షల్లో స్వాహా అయినట్లు వెలుగు చూసినా అటవీ శాఖ అధికారుల విచారణలో రూ.7.80 కోట్లుగా తేలడంతో జిల్లాలో సంచలనమైంది. రూ. కోట్లలో ప్రభుత్వ నిధుల స్వాహా కావడంతో దర్యాప్తు వేగవంతానికి అటవీ అధికారు లు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ‘ఆత్మకూరు అనకొండ’ కేసు ప్రాధాన్యతను బట్టి సీబీసీఐడీకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర అటవీశాఖ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) చలపతిరావు మంగళవారం తెలిపారు. నల్లమల అటవీ చెక్‌పోస్ట్‌లో వాహనాల నుంచి వసూలు చేసే పర్యావరణ రుసుం వంటి పలు ఇతర అటవీ శాఖా ఆదాయపు సొమ్మును ఫీల్డ్ డైరెక్టర్ ఖాతాకు పంపకుండా చాంద్‌బాషా కొత్తగా బంధువులు, కుటుంబీకుల పేరుపై కొత్త ఖాతాలు తెరిచి అందులోకి మళ్లించాడు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తరువాత గానీ అక్రమాలు బయట పడలేదు. ఈ కేసులో ప్రాథమిక అంచనాల మేరకు రూ.25 లక్షలు చాంద్ బాషా కాజేసినట్లు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తులో ఇది రూ.4 కోట్లు స్వాహా చేసినట్లు రికార్డు అయ్యింది. ఈ కేసులో చాంద్‌బాషాతో పాటు పలువురు అరెస్ట్ కూడా అయ్యారు కూడా. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అటవీశాఖ ఏడుగురితో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు బ్యాంకు ఖాతాలను, ఇతర రికార్డులను పరిశీలించిన తరువాత అటవీశాఖ నిధుల స్వాహా కేసులో రూ.7.80 కోట్లు మాయం చేసినట్లు తేల్చారు. ఈ కేసుపై అప్పటి ఎన్‌ఎస్‌టీఆర్ ఎఫ్‌డీపీటీ బి. విజయకుమార్ కూడా తన నివేదికను ప్రభుత్వానికి అందించారు. నిబంధనలను అనుసరించి కేసును సీబీసీఐడీకి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర అటవీ దళాల ప్రధానాధికారి చలపతిరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖిత పూర్వంగా కోరారు. ఈ కేసులో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోననే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వాన్ని కోరిన
రాష్ట్ర అటవీశాఖ ప్రధానాధికారి
రూ.7.80 కోట్ల అటవీశాఖ సొమ్మును
సొంత ఖాతాలకు మళ్లించిన ఉద్యోగి


