నీట్‌ రీ టెస్ట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ రీ టెస్ట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

Jun 17 2026 5:15 AM | Updated on Jun 17 2026 5:15 AM

నంద్యాల: నీట్‌ రీ టెస్ట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్‌సీఎల్‌ఏ, వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. నీట్‌ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలోని బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామానికి సంబంధించిన భూముల సమస్యను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. గూటుపల్లి గ్రామంలోని భూములన్నీ వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ‘వక్ఫ్‌ బోర్డు భూములు’ ‘ఎండోమెంట్‌ భూములు’గా నమోదై ఉండటంతో గ్రామ ప్రజలు వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామం మొత్తం ఈ విధంగా నమోదుకావడం వల్ల భూ లావాదేవీలు, హక్కుల నిర్ధారణ తదితర అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ అంశాల పురోగతి, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్‌ఓ రాము నాయక్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement