శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేపట్టారు. రథోత్సవంలో ముందుగా అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థ రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళా రూపాలు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యురాలు లక్ష్మీదేవి, ఆలయ ఏఈవో జి.స్వాములు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


