బనగానపల్లె రూరల్: ఆకాశంలో మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మొహర్రం నెల ప్రారంభౖమైంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహ ర్రం నెలతో ముస్లింలకు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి బన గానపల్లె పట్టణంలో నవాబు వంశీయులు మీర్ ఫజల్‌అలీఖాన్ ఆధ్వర్యంలో నవాబు కోటలోని హజరత్ అబ్బాస్ పీర్లను భక్తిగీతాల మధ్య ఆస్థానం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పీర్లను అందంగా ముస్తాబు చేసి, పూలదట్టీలు సమర్పించారు. షీయా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఈ నెల 23న చిన్న సరిగెత్తు, 24న మధ్య సరిగెత్తు, 26న జుర్రేరు వాగులో పీర్ల నిమజ్జనంతో మొహర్రం ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హజరత్ అబ్బాస్ పీర్లను దర్శించుకుని ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. బనగానపల్లెలో హిందూ, ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. మొహర్రం పురస్కరించుకుని ఆస్థానాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


