● నీటి బకెట్‌లో పడి బాలుడి మృతి
కొత్తపల్లి: బుడిబుడి అడుగులు వేస్తూ తన అల్లరితో కుటుంబంలో అందరినీ అలరించిన ఏడాదిన్నర చిన్నారికి నూరేళ్లు నిండాయి. ప్రమాదవశాత్తూ నీటి బకెట్‌లో పడి బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన గోకవరం గ్రామ పంచాయతీలోని మజారా గ్రామమైన ఎం.లింగాపురంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కదిరి ఆంజనేయులు, కృష్ణవేణి బాయిలకు ఓ కూతూరు, కుమారుడు ఉన్నారు. ఆంజనేయులు హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు సిద్ధార్థ నందన్‌కు ఏడాదిన్నర వయస్సు ఉంది. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. ఆంజనేయులు సోమవారం ఉదయాన్నే హమాలీ పనులకు వెళ్లి భోజనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. కృష్ణవేణి అతనికి భోజనం వడిస్తున్న క్రమంలో సిద్ధార్థ నందన్ ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటకు వెళ్లా డు. అయితే అప్పటికే ఇంటి ఆవరణలో ఆమె దుస్తులు ఉతికేందుకు బకెట్‌లో నిండుగా నీళ్లు పట్టి ఉంచింది. సిద్ధార్థ నందన్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి బయటకు వచ్చి నీటిబకెట్‌లో తలకిందులుగా పడి ఉన్న కుమారుడిని చూసి లబోదిబోమంది. అపస్మారక స్థితిలో బాలుడిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి మార్గమధ్యలో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది.


