బనగానపల్లె: బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. సర్ సర్వే జరుగుతున్న సమయంలో ఈఆర్‌వో విభాగంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బంధువులైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలను జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి వేతనాలు చెల్లించకుండా నియమించుకున్నారని ఆర్‌డీఓ నరేంద్రనాథ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేసి వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగింపే ధ్యేయంగా కుట్ర జరుగుతుందన్నారు. ఈఆర్‌ఓ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఇద్దరిని ఇతర విభాగానికి మార్పు చేసి, వారి స్థానంలో సచివాలయం, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని కోరారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ఇద్దరు టీడీపీకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించి సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌తో పాటు న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చివరకు అధికారులు స్పందించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తానని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు..
బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో దొంగ ఓట్ల నమోదుపై వారం రోజుల క్రితం నంద్యాలలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. ఈఆర్‌ఓ విభాగంలో ఆపరేటర్లుగా పని చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఫారం–6 అర్హత లేకున్నా టీడీపీ అనుచరులను ఓటర్లుగా చేర్చుతున్నారన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బనగానపల్లె పట్టణంలోని 30 పోలింగ్ కేంద్రాల్లో కొత్తగా 170 మంది ఓటర్లను నమోదు చేశారన్నారు. అయితే 89వ బూత్‌లో ఫారం–6కు నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు బీఎల్‌ఓలు చెబుతుండగా 17 ఓట్లు ఎలా నమోదయ్యాయని ప్రశ్నించారు. బీఎల్‌వోలకు సంబంధం లేకుండానే ఏఈఆర్‌వో లాగిన్ నుంచి ఈఆర్‌వో లాగిన్‌కు పంపి 11 ఓట్లను అక్రమంగా నమోదు చేసినట్లు కాటసాని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను అర్హులైనప్పటికీ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్నారు. ఫారం–8 స్లిప్ ద్వారా ఇళ్లు మారిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను పరిశీలించి మళ్లీ ఓటర్ల జాబితాలో నమోదు చేయకుండా ఉద్దేశ పూర్వకరంగా తొలగిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు అంబటి రవికుమార్‌రెడ్డి, అనిల్, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు సుదర్శన్‌రెడ్డి, కాటసాని రామకృష్ణారెడ్డి, మౌలి, బలిజ రమణ పాల్గొన్నారు.
ఎన్నికల విభాగంలో అనధికార వ్యక్తులు
విధుల నిర్వహణ ఎలా
దొంగ ఓట్లను చేర్చందుకు టీడీపీ నేతల కుట్ర
అర్హులను తొలగిస్తే న్యాయ పోరాటం
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి


