శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే భక్తులు వంద శాతం సంతృప్తి చెందే విధంగా ఆయా సౌకర్యాలు మెరుగుపరచాలని కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దేవస్థానం అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. దేవస్థానం పరిధిలో మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, శౌచాలయాల నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనపై భక్తుల నుంచి వందశాతం సానుకూలత స్పందనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. మురళీబాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు బి. మల్లికార్జునరెడ్డి, కె. వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులకు అందుబాటులోకి ఏడు కాటేజీలు
శ్రీశైల దేవస్థానంలో నిర్మాణం పూర్తయి దాతల ఆధీనంలో ఉన్న ఏడు కాటేజీలను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు శ్రీశైల దేవస్థానంలో దాతల సహకారంతో 42 కాటేజీలు నిర్మించామన్నారు. కాటేజీల నిర్మాణం పూర్తయినప్పటికీ దేవస్థానానికి అప్పగించకపోవడంపై దేవస్థాన ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ మేరకు ఈనెల 13వ తేదీన ఒక కాటేజీ అప్పగించారని అన్నారు. దాతల ఆధీనంలో ఉన్న మొత్తం ఏడు కాటేజీలను దేవస్థానం స్వాధీనం చేసుకుని, దినసరి అద్దైపె భక్తులకు వసతి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
రైతులను మోసగించిన చంద్రబాబు
నంద్యాల: చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్నదాతలను దారుణంగా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ రైతు విభాగం నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో మే నెల రాగానే ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేదని, ప్రస్తుతం జూన్ నెల సగం దాటినా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఒక్క రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు కొండంత అండగా నిలిచి సున్నా వడ్డీ, పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో అందించిందని గుర్తు చేశారు. రైతులకు ఉపయోగపడే నంద్యాల పట్టణంలోని రెండెకరాల మార్కెట్‌యార్డు భూములను టీడీపీ కార్యాలయానికి కేటాయించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్.రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జనార్ధన్ రెడ్డి, మెట్టు వెంకటేశ్వర రెడ్డి, రత్నబాబు చౌదరి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు వంగాల మహేశ్వర రెడ్డి, నాగేశ్వర రెడ్డి, రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్, దేవేందర్ పాల్గొన్నారు.


