నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 15వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ. లక్ష విరాళం

బనగానపల్లె రూరల్‌: నందవరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి నంద్యాల పట్టణానికి చెందిన నల్లబోతుల ఉమాశంకర్‌, హనుమక్క కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆదివారం అందజేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పీవీ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు దాత కుటుంబసభ్యులను సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు.

సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం

బొమ్మలసత్రం: ప్రతిరోజు అరగంట పాటు సైక్లింగ్‌ చేయడంతో శారీరక ధృడత్వం లభిస్తుందని ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ చిన్నికృష్ణ అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిట్‌నెస్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన ఆధ్వర్యంలో సైక్లింగ్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పోలీస్‌ అధికారులతో పాటు యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్థానిక పద్మావతినగర్‌ ఇండోర్‌ స్టేడియం నుంచి శ్రీనివాససెంటర్‌ మీదుగా గాంధీచౌక్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు వ్యాయామం, సైక్లింగ్‌ చేస్తూ ఆరోగ్యంగా జీవించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే వ్యాయామంపై ఆసక్తి పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు సూర్యమౌళి, వేణుగోపాల్‌, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

బయలు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేష పూజలు నిర్వహించారు. అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించింది. ఆదివారం 40 మంది భక్తులు ఈ విశేష పూజలు జరిపించుకున్నారు. ముందుగా మహాగణపతి పూజను జరిపించారు. పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని పండితులు పేర్కొంటున్నారు.

బయలు వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్న ఈఓ తదితరులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement