నంద్యాల(న్యూటౌన్): 2010 సంవత్సరానికి ముందు అపాయింట్‌మెంట్ అయిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం ప్రకారం అందరూ టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో విద్యాహక్కు చట్టం 2009లో వచ్చిందని, అంతకన్న ముందు నియామకం పొందిన ఉపాధ్యాయు లకు టెట్‌తో సంబంధం లేదన్నారు. యూ టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత మార్కులు కాకుండా ఓసీ, బీసీ అనే కాకుండా అందరికీ 40 శాతం మార్కులు పెట్టాలని, సిలబస్ కూడా అందుకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. టెట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. సమావేశంలో యూటీఎఫ్ సభ్యులు సత్యప్రకాష్, కిశోర్, రామకృష్ణుడు, సుజాత, సంధ్యా, జ్యోతి, నాగచిన్నమ్మ, ప్రతాప్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్, చిన్న య్య, తదితరులు పాల్గొన్నారు.


