అనారోగ్యంతో ఉండే పోలీసులను బదిలీ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఉండే పోలీసులను బదిలీ చేస్తాం

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

బొమ్మలసత్రం: వయసురీత్యా కొందరు పోలీసులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వారి విజ్ఞప్తి మేరకు బదిలీ చేసేలా చూస్తున్నామని ఎస్పీ సునీల్‌షెరాన్‌ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీసులకు గ్రీవెన్స్‌డే కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పనిచేసే సిబ్బందితో పాటు హోంగార్డులు హాజరై ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

భ్రమరాంబాదేవికి ఊయలసేవ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబాదేవికి శుక్రవారం అమ్మవారి మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా ఊయలసేవ నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటలకు సేవా సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులను చేసి షోడశోపచార పూజల అనంతరం అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ పూజలు జరిపించారు. అనంతరం శ్రీశైలం లోనీ అంకాలమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడి గడ్డివాములకు నిప్పు

ఆళ్లగడ్డ: వైఎస్సార్‌సీపీ నాయకుడి వరి గడ్డివాములకు టీడీపీకి చెందిన కొందరు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం ఆళ్లగడ్డ మండలం యాదవాడలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరిగడ్డి కొనుగోలు చేసి యాదవాడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నరసింహారెడ్డి పొలం దగ్గర వాములు వేసుకున్నాడు. పొలం దగ్గర ఎవరూ లేని సమయంలో ఎవరో నిప్పు పెట్టడంతో వాములు దగ్ధమయ్యాయి. ‘చంద్రబాబు వె న్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు శుక్రవారం గ్రా మం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తలించుకురావడంతో జీర్ణించుకోలేని టీడీపీకి చెందిన కొందరు దుండగులే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో మోస్తరు వర్షం

నంద్యాల(అర్బన్‌): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 49.2 మి.మీ, చాగలమర్రి మండలంలో అత్యల్పంగా 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జూపాడుబంగ్లాలో 44.8, వెలుగోడు 28.6, పాములపాడు 21.8, పగిడ్యాల 16.4, గడివేముల 14.8, కొత్తపల్లి 14.6, ఆత్మకూరు 12.8, మహానంది 12.2, శ్రీశైలం 10.2, మిడుతూరు 5.8, నంద్యాల అర్బన్‌ 4.4, కోవెలకుంట్లలో 1.6మి.మీ వర్షం కురిసింది.

ఆర్‌యూ నుంచి ఇద్దరు విద్యార్థుల బహిష్కరణ

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులను బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ నాల్గవ సెమిస్టర్‌ చదువుతున్న ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.శరత్‌కుమార్‌ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. వర్సిటీ అధికారులపై నిందలు వేయడం, వర్సిటీ కళాశాల గురించి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం, ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో విద్యార్థి వర్సిటీ కళాశాలలో ఇంగ్లిష్‌ పీజీ నాల్గవ సెమిస్టర్‌ చదువుతున్న రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్‌ ఫెడరేషన్‌(ఆర్‌పీఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షులు బి.నాగరాజును వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఇతను క్రమశిక్షణ లేని ప్రవర్తనతో ప్రవర్తించాడని, వర్సిటీ అధికారులతో అసభ్య పదజాలం వాడుతూ వాగ్వివాదానికి దిగాడనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement