రేషన్‌ డీలర్‌ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్‌ ఆత్మహత్యాయత్నం

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

టీడీపీ కార్యకర్తల వేధింపులే కారణం

నంద్యాల: టీడీపీ కార్యకర్తల వేధింపులు భరించలేక గోస్పాడు మండలంలోని నెహ్రూనగర్‌కు చెందిన రేషన్‌ డీలర్‌ వెంకట లింగారెడ్డి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలివీ.. వెంకట లింగారెడ్డి గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా రేషన్‌ డీలర్‌గా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు లింగేశ్వర్‌ రెడ్డి జాతీయ ఉపాధి హామీ పథకం ఏర్పడినప్పటి నుంచి గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటలింగారెడ్డి డీలర్‌పోస్టును, కుమారుడు లింగేశ్వరరెడ్డి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టును అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలగించారు. వీరు అన్యాయంగా మమ్మల్ని తొలగించారని కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు తిరిగి డీలర్‌షిప్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టు పొందారు. ఇదే క్రమంలో ఇంటి వద్ద చిన్నపాటి బంకు ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నాయకులు డీలర్‌ పోస్టు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టు వీరికే రావడంతో ఈ వ్యవహారం మింగుడు పడక చివరకు వెంకటలింగారెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న బంకును గ్రామంలో ఉండకుండా తొలగించారు. దీంతో చేసేది లేక వెంకట లింగారెడ్డి కుటుంబం బంకును పక్కకు తీసుకొని ఇంటి వద్దనే ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా చాలదని వారి ఇంటి ఎదురుగా మట్టి తోలి ట్రాఫిక్‌ సమస్యను సృష్టించారు. దీంతో టీడీపీ నాయకుల ఆగడాలు భరించలేక వెంకటలింగారెడ్డి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్‌ తులసీశ్వరరెడ్డి అండతో గ్రామ టీడీపీ నాయకులు బైరెడ్డి కొండారెడ్డి(దత్తు కొండారెడ్డి), బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడి రమణారెడ్డి, తాడి రాఘవేంద్రరెడ్డిలు ఉద్దేశపూర్వకంగా తనను వేధిస్తుండటంతో అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు ‘సాక్షి’తో వాపోయాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement