● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు వస్తున్న అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని 32వ స్వర్ణవార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రజలకు అందుబాటులో సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణవార్డు పరిధిలోని కుటుంబాల వివరాలు, పథకాల అర్హతలు, సేవల డెలివరీ స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని నవీకరించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ వార్డుకు వచ్చిన పలువురు స్థానికులతో కలెక్టర్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలన్నారు.


