‘నైపుణ్యాల అంచనా’ను పకడ్బందీగా నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

‘నైపుణ్యాల అంచనా’ను పకడ్బందీగా నిర్వహించండి

Mar 15 2026 4:58 AM | Updated on Mar 15 2026 4:58 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న నిర్వహించే ‘ప్రాథమిక చదువు, సంఖ్యా నైపుణ్యాల అంచనా పరీక్ష’ను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. శనివారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1,62,235 మంది అభ్యాసకులను ప్రత్యేక యాప్‌ ద్వారా నమోదు చేశామన్నారు. వీరి కోసం జిల్లాలో 1,368 పరీక్షా కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రతి కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా అంగన్‌వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో హాజరు కావాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సదుపాయం, శానిటేషన్‌ వంటి మౌలిక వసతులను తప్పనిసరిగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొదుపు సంఘాలు, శ్రామిక సంఘాల ద్వారా ప్రతి అభ్యసకునికి పరీక్షపై విస్తృతంగా అవగాహన కల్పించి, అందరూ తప్పనిసరిగా పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలన్నారు.

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి శని వారం ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఎం.నితీష్‌ శ్రీనివాస్‌ రూ.1,11,000 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా దాతను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదం అందించి సత్కరించారు. అలాగే విరాళానికి సంబంధించిన బాండ్‌ అందజేశారు.

సీపీఆర్‌, ప్రథమ చికిత్సపై శిక్షణ

కర్నూలు: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో ముందుండే పోలీసు సిబ్బందికి సీపీఆర్‌ విధానం, గాయాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. 200 మంది ఏపీఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లకు పోలీసు శిక్షణ కేంద్రంలో సీపీఆర్‌, ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూ లు మెడికవర్‌ హాస్పిటల్‌ డాక్టర్లు, పోలీస్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌ డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మెడికవర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ సునీల్‌ యాదవ్‌, పోలీసు వెల్ఫేర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ స్రవంతి, డీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌, డీఎస్పీ ప్రసాద్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement