వివాదాలకు ‘బలి’అవుతూ! | - | Sakshi
Sakshi News home page

వివాదాలకు ‘బలి’అవుతూ!

Mar 15 2026 4:57 AM | Updated on Mar 15 2026 4:57 AM

ఫోర్త్‌టౌన్‌ పీఎస్‌ ఉక్కిరిబిక్కిరి

కర్నూలు: కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ కొంతకాలంగా వివాదాలకు అడ్డాగా మారింది. వరుస పరిణామాలతో స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అక్రమ కేసుల నమోదు, దర్యాప్తు పేరుతో వేధింపులు, స్టేషన్‌కు వెళ్లిన బాధితుల పట్ల దురుసు ప్రవర్తన తదితర ఘటనలతో బాధితులు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు తలెత్తాయి. స్టేషన్‌లో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం తల పట్టుకునేంతగా వివాదమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కడం గమనార్హం. గంజాయి కేసు విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది పవన్‌ కుమార్‌ను సీఐ విక్రమసింహ దూషించడమే కాక బౌతికంగా దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. సీఐ విక్రమసింహపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మధ్యవర్తుల ద్వారా న్యాయవాది పవన్‌కుమార్‌తో సీఐ విక్రమసింహ రాజీ కుదుర్చుకున్నారు.

యూట్యూబ్‌ ఛానల్‌

నిర్వాహకుడి నిర్బంధం

తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్‌)పై ఫిబ్రవరి 22న నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 41ఏ నోటీసు ఇచ్చి విచారణ నిమిత్తం మార్చి 10న కేవీఆర్‌ను స్టేషన్‌కు పిలిపించి చంద్రబాబు నాయుడుపైనే కథనాలు చేస్తావా.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి అభాసుపాలు చేస్తావా అంటూ నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. కేవీఆర్‌ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కేవీఆర్‌ను కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ ఎదుట హాజరుపరచి విడుదల చేశారు. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ మధ్యవర్తి ద్వారా కేవీఆర్‌తో రాజీ సంప్రదింపులు చేశారు.

ముడుపుల విషయంలో

క్రైం పార్టీ పోలీసులపై వివాదం

ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న క్రైం పార్టీ పోలీసుల అవినీతిపై ఏకంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేరి వివాదాస్పదమయ్యాయి. కర్నూలు కొత్తబస్టాండ్‌లో రెండు బంగారు చోరీ కేసులు చోటు చేసుకున్నాయి. వీటి విచారణ కోసం క్రైం పార్టీ పోలీసులు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ ఘటన కూడా వివాదాస్పదంగా మారడమే కాక తెలంగాణలో క్రైం పార్టీ పోలీసులపై కేసు నమోదైంది. దీంతో వారిని వీఆర్‌కు పంపారు. ఆ తర్వాత వేర్వేరు చోట్లకు బదిలీ చేశారు. అలాగే ఇదే స్టేషన్‌లో సీఐ మధుసూదన్‌గౌడ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రవి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యారు.

శాంతి కోసం పొట్టేలు బలి

వరుస ఘటనల నేపథ్యంలో స్టేషన్‌కు దరిద్రం పట్టింది.. శాంతి చేయాలి.. ఏ కేసు దర్యాప్తు ప్రారంభించినా సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్‌హెచ్‌ఓకు సిబ్బంది సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించేందుకు పొట్టేలును పోలీస్‌స్టేషన్‌కు బలిచ్చి రక్తతర్పణ చేశారు. ప్రధాన గేటు వద్ద పొట్టేలును బలిచ్చి ఓ రెస్టారెంట్‌లో వంటలు చేయించి స్టేషన్‌ సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ అంశం సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తు దోషం పట్టిందంటూ పోలీసులే స్వయంగా స్టేషన్‌కు పొట్టేలును బలివ్వడం చర్చనీయాంశమైంది.

స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ పనితీరుపై

విమర్శల వెల్లువ

పరిస్థితులు అనుకూలించేందుకు

శాంతి పేరుతో స్టేషన్‌కు పొట్టేలు బలి

రక్త తర్పణం చేసి

విందు చేసుకున్న సిబ్బంది

పోలీసు శాఖలో హాట్‌ టాపిక్‌గా

మారిన ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement