శ్రీగిరిలో సౌకర్యాలు కను‘మరుగు’
నిర్వహణ
కష్టతరంగా మారింది
● పే అండ్ యూజ్ పద్ధతిలో
మరుగుదొడ్లు
● భక్తులకు తొలగని కష్టాలు
శ్రీశైలంటెంపుల్: భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో శ్రీశైల దేవస్థాన పాలకమండలి సభ్యులు, అధికారులు విఫలమయ్యారు. భక్తలు మరుగుదొడ్లకు వెళితే రూ.10, స్నానానికి వెళ్తే రూ.20 చెల్లించాల్సి వస్తోంది. శ్రీశైలానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని స్వామి దర్శనానికి వెళ్తారు. వసతి గదులను పొందేందుకు తమ వద్ద ఆర్థిక స్థోమత లేని భక్తులు క్షేత్ర పరిధిలో దేవస్థానం ఏర్పాటు చేసిన టాయిలెట్లు, మరుగుదొడ్లపై ఆధారపడతారు. అయితే క్షేత్ర పరిధిలో ఎక్కడా ఉచిత మరుగుదొడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
డబ్బులు ఇవ్వాల్సిందే!
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సరిపడా వసతి గదులు లేవు. దీంతో స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు స్నానాధికాలకు సామూహిక టాయిలెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. శ్రీశైల క్షేత్రంలో శివసదనం, ఔటర్‌రింగ్‌రోడ్డు, పార్కింగ్ ప్రదేశాల వద్ద, పుష్కరిణి సమీపంలో, శ్రీశైలం పీహెచ్‌సీ ఎదురుగా, ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద, అమ్మవారి ఆలయం వెనుక, టూరిస్టు బస్టాండ్ వద్ద, హెచ్‌పీసీఎల్ పెట్రోల్‌బంక్ వద్ద ఇలా పలుచోట్ల మొత్తం సుమారు 800టాయిలెట్లు ఉన్నాయి. ఆయా టాయిలెట్లను వినియోగించుకుంటే టాయిలెట్‌కు రూ.10, స్నానానికి రూ.20వెచ్చించాల్సిందే. క్షేత్ర పరిధిలో ఉన్న 678టాయిలెట్లకు పారిశుద్ధ్య విభాగం ద్వారా దేవస్థానం టెండర్ పిలిచారు. సంవత్సరానికి రూ.24లక్షల చొప్పున దేవస్థానానికి చెల్లించేలా టెండర్‌లో పొందుపర్చారు.
క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు ఉచితంగానే టాయిలెట్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి అమ్మవారి ఆలయం వెనుక, ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న టాయిలెట్లను ఉచితంగా నిర్వహిస్తాం. క్షేత్ర పరిధి 4 ఎకరాల్లో ఉండడంతో నిర్వహణ పరంగా కష్టతరంగా మారింది. ఈ విషయమై బోర్డులో కూడా చర్చించాం. క్షేత్ర పరిధిలో ఉన్న ప్రైవేట్ టాయిలెట్లలో సైతం ఫిబ్రవరి 1నుంచి యూజర్ చార్జీలు రూ.5 వసూలు చేసేలా చర్యలు చేపడుతున్నాం.
– ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి
శ్రీగిరిలో సౌకర్యాలు కను‘మరుగు’


