కందిపప్పు.. కరువే!
నంద్యాల(అర్బన్): చౌక దుకాణాలకు సబ్సిడీపై అందించే కందిపప్పు సరఫరాను చంద్రబాబు ప్రభుత్వం 18 నెలలుగా నిలిపివేసింది. దీంతో రేషన్ దుకాణాలకు వెళ్లిన లబ్ధిదారులు కందిపప్పు లేక నిరాశగా తిరిగివస్తున్నారు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కంది పప్పు కిలో ధర రూ.180 పలికింది. ఈ సమయంలో సబ్సిడీపై ప్రజలకు అందజేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక ధరకు కోట్ చేస్తారన్న భయంతో పూర్తిగా పంపిణీయే వద్దనుకుంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.120 ఉంది. ధర తగ్గినప్పుడైనా సబ్సిడీపై చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. నిజానికి కంది పప్పు సబ్సిడీపై కిలో రూ.67కు అందించాలి. ఆంటే ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్లో కొన్నా కిలో రూ.100కు లభిస్తుంది. అది కొని ప్రజలకు పంపిణీ చేసినా రూ.30కి మించి ప్రభుత్వంపై భారం పడదు. అయినా తగిన చర్యలు తీసుకోవడం లేదంటే ప్రజా సంక్షేమంపై ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా 1,204 రేషన్ దుకాణాలు ఉన్నాయి. సుమారుగా 5.41లక్షల రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెలా 531.729 టన్నుల కందిపప్పు అవసరం ఉంది. ప్రతి నెలా 20వ తేదీ లోపు రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లు డీడీలు తీస్తున్నా.. పౌరసరఫరా శాఖ మాత్రం కంది పప్పుకు సంబంధించిన డీడీలు తీయ్యొద్దంటూ డీలర్లకు ఆదేశిస్తుంది. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం సరఫరా చేస్తుంది. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని ప్రజలు రేషన్ షాపు డీలర్లను అడుగుతుంటే తమకే రాలేదన్న సమాధానం వస్తోంది. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు కందిపప్పు రేషన్ దుకాణాల ద్వారా తీసుకెళ్లలేని పరిస్థితి వచ్చిందంటూ కార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలపై భారం...
చౌక దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లకు కందిపప్పు సరఫరా నిలిచి పోవడంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి కొనాల్సివస్తోంది. జిల్లా వ్యాప్తంగా 7 ఎంఎల్‌ఎస్ (మండల స్థాయి స్టాక్ పాయింట్లు) పాయింట్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ఎంఎల్‌ఎస్ పాయింట్లో కూడా కిలో కందిపప్పు కూడా లేకపోవడం గమనార్హం.
చౌక దుకాణాలకు 18 నెలలుగా
నిలిచిపోయిన సరఫరా
జిల్లాకు 531.729 టన్నులు అవసరం
ఇప్పటి వరకు ఎంఎల్‌ఎస్
పాయింట్లకు అందని వైనం


