బోగస్ స్లాట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి
డోన్: బోగస్ ప్లాట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పండుతోందని, ఇలా నమోదు చేస్తున్న అజ్ఞాత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డోన్ డీఎస్పీ శ్రీనివాసులుకు జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై డోన్ సబ్‌రిజిస్ట్రార్ మహబూబ్ బాషా బుధవారం రాత్రి సీఐ ఇంతియాజ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బోగస్ ప్లాట్లపై పత్రికలు, ప్రసార సాధనాల్లో వస్తున్న వార్తలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రార్ చార్జీలు ప్రభుత్వం పెంచుతుందనే వార్తల నేపథ్యంలో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు బయటి వ్యక్తులు కుమ్మకై ్క రిజిస్ట్రర్ల కోసం కార్యాలయాలకు వచ్చే వ్యక్తులకు రూ.2వేల నుంచి రూ.6వేల వరకు స్లాట్‌ను విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
నేడు ఉద్యోగుల సమస్యల పరిష్కార కార్యక్రమం
నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నేడు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలకు అర్జీలు స్వీకరించి, 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయి అంశాలను సంబంధిత అధికారులకు వివరిస్తామన్నారు. వార్షిక, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, కార్యాలయాల మౌలిక సదుపాయాలు, మహిళా ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై అర్జీలు స్వీకరిస్తామన్నారు. క్రమశిక్షణారాహిత్య కేసులు పెండింగ్‌లో ఉండటంతో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు నిలిచిపోయిన అర్జీలను కూడా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలని ఆదేశించారు.
రమణీయం.. పార్వేట మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీ అహోబిలేశుడి పార్వేట ఉత్సవ పల్లకి నాగిరెడ్డిపల్లె నుంచి బుధవారం అర్ధరాత్రి పడకండ్లకు చేరుకుంది. గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి శ్రీ ప్రహ్లాదవరద స్వామి, శ్రీ జ్వాలానరసింహ స్వాములు కొలువైన ఉత్సవ పల్లకీకి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిని గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ తెలుపులపై కొలువుంచుతూ భక్తిని చాటుకున్నారు. ఉత్సవ పల్లకి పడకండ్ల నుంచి శుక్రవారం ఉదయం ఆళ్లగడ్డలో కొలువు దీరనుంది. నాలుగు రోజుల పాటు పట్టణంలో వివిధ తెలుపులపై పూజలు అందుకోనుంది.
నంద్యాలలో జిల్లాస్థాయి ఎక్స్‌పో ఎగ్జిబిషన్
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని స్థానిక వైఎస్సార్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్ గురువారం నిర్వహించారు. విద్యార్థుల్లో కెరీర్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి , అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నిత్యానంద రాజులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగ సువర్చల అధ్యక్షత వహించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు.


