విద్యుదాఘాతంతో రైతు మృతి
ఆళ్లగడ్డ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన బాచేపల్లిలో చోటుచేసుకుంది. పీర్ల బీబీ, పెద్ద ఖాశీంల కుమారుడు షేక్ ఖాశీంసా (25) మంగళవారం తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లారు. ఇనుప పార భుజాన పెట్టుకుని పొలం గట్టుపై నడుస్తూ వెళ్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వైర్ పారకు చుట్టుకుని విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే పడిపోయాడు. కొంతసేపటికి ఖాశీంసా తల్లి బీబీ పొలానికి వెళ్లి చూడగా కొడుకు కింద పడి ఉండటం గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్క పొలాల రైతులు వచ్చి చూడగా ఖాశీంసా మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని తల్లి బీబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు.


