అహోబిలంలో ధనుర్మాస పూజలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో ధనుర్మాస పూజలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి తోపాటు శ్రీ గోదాదేవి అమ్మవారిని యాగశాలలో కొలువుంచారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కనుల పండుగగా నవకలశ స్థాపన, పంచామృతాభిషేకం, తిరుమంజనం, అర్చన నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తి గోదాదేవి అమ్మవారిని మూలవిరాట్ గోదాదేవి అమ్మ వారి సన్నిధికి తోడ్కొని వచ్చి కొలువుంచారు. సాయంత్రం ఉత్సవం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఫిబ్రవరి 8 నుంచి మహా
శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలన భవనంలోని శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనులు వేగవంతంగా పూర్తి నాత్యతతో చేయాలన్నారు. గతేడాది కంటే 20 నుంచి 30శాతం అదనపు ఏర్పాట్లు ఉండాలన్నారు. పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెర్వు, భీమునికొలను, కై లాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగను తీర్చిదిద్దాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా 30 లడ్డూ కౌంటరుల ఏర్పాటు చేయాలన్నారు.
ఉత్తమ గ్రామ పంచాయతీగా కొరటమద్ది
గడివేముల: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కటి మాత్రమే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై నట్లు ఎంపీడీఓ వాసుదేవగుప్తా, డిప్యూటీ ఎంపీడీఓ మహీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గడివేముల మండలంలోని కొరటమద్ది గ్రామ పంచాయతీని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పారిశుద్ధ్యం, ఇంటి, నీటి పన్నుల వసూళ్లు, వర్మీ కంపోస్టు తయారీ, విక్రయాలు, గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చే వనరుల నిర్వహణ, తదితర అన్ని రకాల అభివృద్ధి పనులను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టినట్లు వెల్లడించారు. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎడమకంటి నాగేశ్వరరెడ్డి దంపతులకు ప్రత్యేక ఆహ్వానం అందిందన్నారు.
దళితుల ఇళ్లకు
విద్యుత్ తొలగింపు
చాగలమర్రి: అదనపు బిల్లులు చెల్లించని దళితుల ఇళ్లకు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ను తొలగించింది. చాగలమర్రిలోని పాత ఎస్సీ కాలనీకి శనివారం ఉదయం విద్యుత్ శాఖ ఏఈ రమణయ్య ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చారు. పాత బకాయిల వసూలు బిల్లులు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను తొలగించారు. మీటర్లు ఉన్న దళితుల ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందుతుందని, అంతకంటే ఎక్కువ వినియోగిస్తే అదనపు మొత్తం బిల్లులు చెల్లించవలసి ఉందని ఏఈ రమణయ్య తెలిపారు. అదనపు బిల్లులు చాలా కాలం నుంచి చెల్లించక పోవడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్తు కనెక్షన్లను తొలగించామన్నారు. దళిత కాలనీలో ఉన్న ప్రజలు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కోట్ల రూపాయల విద్యుత్తు బిల్లులు బకాయిలున్నా విద్యుత్తు కనెక్షన్లు తొలగించలేదన్నారు. దళితులమని ఉద్దేశంతో తమ ఇళ్లకున్న విద్యుత్తు కనెక్షన్లు తొలగించారరని ఆరోపించారు.
అహోబిలంలో ధనుర్మాస పూజలు
అహోబిలంలో ధనుర్మాస పూజలు


