భర్తను బెదిరించబోయి..
ఎమ్మిగనూరురూరల్: మద్యానికి బానిస అయిన భర్తలో మార్పు రావాలని బెదిరించే ప్రయత్నంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన రాయల తిమ్మమ్మ(34)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు అనిత, అనూష, కుమారుడు అరవింద్ ఉన్నారు. పొలం పనులకు వెళ్లకుండా భర్త మద్యానికి బానిస కావడంతో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదు. గురువారం సాయంత్రం ఇదే విషయంలో వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. మద్యం తాగడం మానకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పత్తి పంటకు తెచ్చిన గడ్డి మందును తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. భర్త గమనించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్ర వారం ఉదయం మృతి చెందింది. తల్లి మృతితో పిల్లలు రోదిస్తున్నారు. రెండెకరాల పొలంలో పత్తి, మిరప పంటలు సాగు చేసి రూ. 6 లక్షల వరకు అప్పులు అయ్యాయని కుటుంబీకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.


