రైతుల గుండెల్లో ‘పైపులైన్’ గుబులు
ఓర్వకల్లు: పచ్చని పంటపొలాల మధ్య నిర్మించతలపెట్టిన పైపులైన్ నిర్మాణం రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పూడిచెర్ల నాగుల చెరువు వద్ద పైపులైన్ నిర్మాణాన్ని రైతులు అడ్డుకున్నారు. ఓర్వకల్లు ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నీటిని నిల్వ ఉంచేందుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. ఈ పైప్‌లైన్ నుంచి వచ్చే రెండు టీఎంసీల నీటిని మీదివేముల సమీపాన జలాశయం నిర్మించనున్నారు. పైపులైన్ నిర్మాణం కోసం 54.74 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం గార్గేయపురం భూములకు ఎకరా రూ.12.50 లక్షలు, కేతవరం భూములకు ఎకరానికి రూ.6.50 లక్షలు, పూడిచెర్ల భూములకు ఎకరానికి రూ.12.50 లక్షల చొప్పున ధరలు నిర్ణయించారు. గార్గేయపురం–కేతవరం మధ్య ఉన్న హంద్రీ–నీవా కాలువ నుంచి నీటిని కేతవరం, పూడిచెర్ల మీదుగా ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడు వద్ద నెలకొల్పిన స్టీల్ ప్లాంట్ వరకు పైపులైన్ ద్వారా ప్రవహించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆమేరకు పైపులైన్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు సజావుగా జరిగాయి.
వివాదం ఇలా..
పైపులైన్ నిర్మాణం పూడిచెర్ల వద్దకు రాగానే వివాదాస్పదం అయ్యింది. పైపులైన్ నిర్మాణంలో భాగంగా కేతవరం దగ్గర 1.30 ఎకరాలు, పూడిచెర్ల వద్ద 22 సెంట్లు, గార్గేయపురం వద్ద 1.50 ఎకరాల చొప్పున ప్రైవేట్ భూములు తీసుకున్నారు. ఈ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బాధిత రైతులకు పరిహారం చెల్లించారు. అయితే పూడిచెర్ల వద్ద గల నాగుల చెరువు కట్ట మలుపు నుంచి ఊరుబయట పొలాల మధ్య పైపులైన్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించడం వివాదాస్పదం అయ్యింది. వాస్తవానికి పూడిచెర్ల గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండ పైభాగం నుంచి పైపులైన్ తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించివున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు 3.50 ఎకరాల మేర పొలాల భూములు ఇవ్వాల్సిందిగా రైతులను కోరారు. అయితే స్థానిక రైతుల్లో ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో అధికారులు చేసేదేమీలేక వెనుతిరిగి వెళ్లారు.
పట్టా భూముల్లో పైపులైన్
నిర్మించేందుకు ససేమిరా
పూడిచెర్ల పంట పొలాల్లో
వివాదాస్పద నిర్మాణం
కాంట్రాక్టర్‌కు ప్రయోజనమంటూ
అడ్డగించిన రైతులు


