శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల బహూకరణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి శనివారం శ్రీశైం, కొత్తపేటకు చెందిన సుద్దాల మహేష్ ఒక వెండి పళ్లెం, వెండి గిన్నె విరాళంగా సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగాణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయ ఇన్‌స్పెక్టర్ కె.మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. రెండు వెండి వస్తువుల బరువు 727 గ్రాములు ఉంటుందని దాత తెలిపారు. అనంతరం దాతకు రసీదును అందజేసి, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివారు వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మార్గశిర మాసం శుభదినాలను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు తరలివచ్చారు. వేకువజామునుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు.
విద్యార్థి ఫెయిల్ అయితే ఉపాధ్యాయులదే బాధ్యత
కొత్తపల్లి: పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులదే బాధ్యత అని జిల్లా విద్యాధికారి పి.జనార్దన్ రెడ్డి అన్నారు. సులభ రీతిలో విద్యను బోధించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. శివపురం గూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించి, వ్యక్తిగత శుభ్రత లేకపోవడంతో ఉపాధ్యాయులు కొన్ని సూచనలు చేశారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్‌ను తనిఖీ చేసి చిన్నారులకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని ఆదేశించారు.
తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా
నంద్యాల: తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో శనివారం డీఆర్‌ఓ సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు సంబంధించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎం మిషీన్లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఏర్పాటు చేసేలా చూడాలని రాజకీయ పార్టీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సాయిరాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ రియాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల బహూకరణ


