అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
నంద్యాల: అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, సీడీపీఓ, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు తాజా కాయగూరలతో పాటు వారి వయస్సును బట్టి విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. టీనేజ్ గర్భాలకు సంబంధించి బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డలో ఎక్కువ శాతం కేసులు నమోదు అవుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎంత మంది చిన్నారులు ఉన్నారు అనే వివరాలను సోమవారం అందజేయాలని, ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


