అడ్డగోలుగా జాబ్‌కార్డుల తొలగింపు
ఈ–కేవైసీ పేరిట ఏకపక్షంగా వేటు
కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు సర్కారు రాజకీయ కక్షతో ఉపాధి కూలీల నోటికాడి ముద్దను లాగేస్తోంది. జిల్లాలో 3 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వీటిల్లో 5,56,672 మంది కూలీలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారని, ఉపాధి పనుల పట్ల ఆసక్తి లేదని, జాబ్‌కార్డు హోల్డర్లు మరణించారని తదితర కారణాలతో 44,501 జాబ్‌కార్డుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఈ కారణంగా 1,23,997 మంది కూలీలు ఉపాధి పనులను దూరం కానున్నారు. తొలగించిన జాబ్‌కార్డుల వివరాలను పరిశీలిస్తే 80 శాతం మంది ప్రతి ఏటా ఉపాధి పనులకు వస్తున్నవారే. మాకు ఈ–కేవైసీ విషయమే తెలియదని.. మేట్/ఫీల్డ్ అసిస్టెంట్ ఆ విషయమే చెప్పలేదని కూలీలువాపోతున్నారు. జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంటు ఉంటారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత 300 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ–కేవైసీ జరుగుతుండటంతో పచ్చపాతం చోటు చేసుకుంటోంది. ఫలితంగా 1.23 లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోనున్నారు.
నేడు గ్రామసభల్లో తొలగింపులకు ఆమోదం
ఈ–కేవైసీ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో గ్రామసభలు నిర్వహించి జాబ్‌కార్డుల తొలగింపులకు ఆమోదముద్ర వేయనున్నారు. జిల్లాలో ఈ నెల 22న గ్రామసభలు నిర్వహించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు ఇచ్చింది. గోనెగండ్ల మండలంలో 4,788, వెల్దుర్తి మండలంలో 2,762, కోసిగి మండలంలో 3,148, కోడుమూరు మండలంలో 2,423, ఆలూరులో 2,261, దేవనకొండలో 2,963, నందవరంలో 2,306, ఆదోనిలో 2,093, సీ.బెళగల్ మండలంలో 2,147 చొప్పున ప్రకారం జాబ్‌కార్డులు తొలగించినట్లు స్పష్టమవుతోంది.
మాకు ఉపాధి పనులే అధారం. ఎలాంటి వ్యవసాయ భూములు లేవు. ఉపాధి పనులు పెట్టని సమయంలో వలసపోతుంటాం. నాట్ విల్లింగ్ కారణం చూపి నా భార్య కోమలిక(ఏపీ –13–002–017–027/10703) ను ఉపాధి పనులకు దూరం చేశారు. ఈ–కేవైసీ విషయం మాకు ఎవ్వరూ చెప్పలేదు. ఇలా ఏకపక్షంగా తొలగించడం అన్యాయం.
– నరసప్ప, జమ్ములదిన్నె, కోసిగి మండలం
40,401 జాబ్‌కార్డుల తొలగింపుతో
1.23 లక్షల మంది కూలీలకు
ఉపాధి దూరం
మైగ్రేషన్, ఉపాధి పనుల పట్ల
ఆసక్తి లేదనే కారణాలతో తొలగింపులు
నేడు గ్రామసభలలో ఆమోదముద్ర


