కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 3వ తరగతి ప్రవేశాలతో పాటు 4 నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ ( నేడు ) చివరి రోజని ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కన్వీనర్/ ప్రిన్సిపాల్ ఏ లక్ష్మిగుర్రప్ప ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు, ఆలూరులోని బాలికల పాఠశాలల్లో 3వ తరగతికి ఒక్కో పాఠశాలలో 40 సీట్లు, తుగ్గలిలోని బాలుర పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో 30 సీట్లను ఎస్‌టీ, ఎస్‌సీలకు 05, బీసీలకు 02, ఓసీలకు 01, ఏఈక్యూ ( ఏజెన్సీ ఎంప్లాయిమెంట్ కోటా )కు 01, యానాది/ దివ్యాంగులకు ఒక సీటు కేటాయించినట్లు పేర్కొన్నారు. మూడు పాఠశాలల్లో మొత్తం 120 సీట్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే 4 నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లను కూడా భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతున్నామన్నారు. ఆలూరు బాలికల పాఠశాలలో 4వ తరగతిలో 27, 5వ తరగతిలో 05, 9వ తరగతిలో 3 సీట్లు ఉన్నాయన్నారు. కర్నూలు బాలికల పాఠశాలలో 4వ తరగతిలో 27, 5వ తరగతిలో 22, 6వ తరగతిలో 12, 7వ తరగతిలో 04, 8వ తరగతిలో 06, 9వ తరగతిలో 06 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. తుగ్గలి బాలుర పాఠశాలో 4వ తరగతిలో 36, 5వ తరగతిలో 30, 6వ తరగతిలో 34, 7వ తరగతిలో 11, 8వ తరగతిలో 17, 9వ తరగతిలో 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. బ్యాక్‌లాగ్ ఖాళీలకు గిరిజన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 30వ తేదిన స్థానిక బిర్లాగేట్ సమీపంలోని గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో లాటరీ నిర్వహిస్తామన్నారు.