
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
కర్నూలు/కల్లూరు: జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు మండలం గార్గేయపురం బ్రిడ్జి దగ్గర జరిగిన ప్రమాదంలో సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కర్నూలు నుంచి నందికొట్కూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆదివారం రాత్రిగుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వాహనం తలపై వెళ్లడంతో నుజ్జునుజ్జు అయింది. ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీ22 ఏఎల్ 1227 ఆధారంగా ఎవరన్నది విచారణ జరుపుతున్నారు. వర్షం పడుతుండటంతో ఆ మార్గం గుండా వెళ్లేవారు ప్రమాద సంఘటన వద్ద ఆగకుండా వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.
దూపాడు దగ్గర...
ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలో దూపాడు దగ్గర 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాండు(41) అనే వ్యక్తి మృతి చెందాడు. ఉలిందకొండ ఎస్‌ఐ ఎం.నరేష్ తెలిపిన వివరాలు...అశోకా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో పాండు వంట మనిషిగా పని చేస్తున్నాడు. పనిమీద రోడ్డుపైకి రాగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య శ్రీదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.