ఫ కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ: పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లోని తన చాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు, సర్ ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఐఆర్లో పెండింగ్లో ఉన్న 2,195 మంది ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం నాటికి పూర్తిచేయాలని తహసీల్దార్లు, బీఎల్ఓలను ఆదేశించారు. ఓటు తొలగించబడిన వారు తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ, వివిద పార్టీల నాయకులు ముంతాజ్అలీ, బక్క పిచ్చయ్య, అన్సారి, లింగస్వామి, నర్సిరెడ్డి, రవి, అద్దంకి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరుగా నమోదు చేసుకోండి
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఉంటూ అర్హత కలిగిన ప్రతిఒక్కరూ ఫారం–18లో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నవంబర్ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 25న పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. ముసాయిదా జాబితాపై డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించిన అనంతరం డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.


